ఎయిర్‌టెల్ ప్లాన్ గడువు ముగిసిందా, మీ ఇన్‌కమింగ్ కాల్స్ కట్ అయినట్లే 

ఎయిర్‌టెల్ తమ ఖాతాదారులకు దిమ్మతిరిగే వార్తను చెప్పింది.ఇన్‌కమింగ్ కాల్స్ నిబంధనలను మార్చిన ఎయిర్‌టెల్ ఇకపై ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఏడు రోజులు మాత్రమే ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది 15 రోజులుగా ఉండగా, ఇప్పుడు దానిని సగానికి కుదించింది.

దీంతోపాటు తమ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత రీచార్జ్ చేసుకోకపోతే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. యూజర్ల నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్‌పీయూ)ని పెంచుకునే దిశగా ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఎయిర్‌టెల్ నిర్ణయంపై టెలికం విశ్లేషకులు మండిపడుతున్నారు. టెల్కో తాజా నిబంధనల వల్ల ఎయిర్‌టెల్ ఖాతాదారులు మరో నెట్‌వర్క్‌కు మారే (పోర్టబులిటీ) అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రిలయన్స్ జియో రాకతో కుదేలైన టెలికం కంపెనీలు తమ ఖాతాదారులు చేజారిపోకుండా ప్లాన్లు ప్రకటిస్తున్న సమయంలో ఎయిర్‌టెల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఖాతాదారులకు కూడా మింగుడుపడడం లేదు.

ఇదిలా ఉంటే వొడాఫోన్ సంస్థ కూడా  త్వరలో ఇదే నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కాగా ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థకే చేటు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరింతమంది ఎయిర్‌టెల్ కస్టమర్స్ జియో వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. 

న్యూస్ టెక్నాలజీ ఎయిర్‌టెల్ ఐడియా వొడాఫోన్